రామగుండం పోలీస్ కమిషనరేట్
వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి: మహిళలకు షీ టీమ్ పోలీసుల పిలుపు
మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, గోదావరి రోడ్డులో ఉన్న ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణా కోర్సులు నేర్చుకుంటున్న మహిళలకు శుక్రవారం జిల్లా షీ టీమ్ పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ మహిళలు సమాజంలో, కార్యాలయాల్లో, ప్రయాణ సమయంలో, సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.కుటుంబ గౌరవం,భయం, సామాజిక ఒత్తిడి కారణంగా చాలామంది మహిళలు తమ సమస్యలను బయటకు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం వివిధ చట్టాలను అమలు చేస్తోందని, మహిళలకు అండగా షీ టీమ్స్ వంటి ప్రత్యేక పోలీసు విభాగాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని వివరించారు.
పెళ్లికి ముందు లేదా పెళ్లి తర్వాత పరిచయమైన వ్యక్తులు పాత పరిచయాలను లేదా వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385కు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.
మహిళలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని, సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని షీ టీమ్ సిబ్బంది తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు సతీష్, వనిత, నిర్వాహకులు అంజి, ఇతర సిబ్బంది, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.





