ప్రాంతీయం

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

6 Views

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా, మార్చి 9, 2026:
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇరవేని రాయమల్లు తన భూమికి సంబంధించి పాత పట్టాదారు పాసుపుస్తకం ఉందని, నూతన పట్టా పాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన దుర్గం మల్లేష్ తనకు సమీకృత కూరగాయల మార్కెట్ లో కేటాయించిన దుకాణాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కన్నేపల్లి మండల కేంద్రానికి చెందిన బోయ పోచం తనకు పూర్వీకుల నుండి వస్తున్న భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆల్ ఇండియా ఎస్.సి./ఎస్.టి. ఐక్యవేదిక ప్రతినిధి పెరుగు తిరుపతి తన దరఖాస్తులో లక్షెట్టిపేట మండలం ఉత్కూరు చౌరస్తాలో గురువారం జరుగుతున్న వారసంతను వ్యవసాయ మార్కెట్ యార్డు ఏరియాకు మార్చాలని కోరారు. రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధి గుంట నాగరాజు తన దరఖాస్తులో డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీ మాఫీ చేసి ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను ఇప్పించాలని కోరారు. వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామానికి చెందిన పొలంపల్లి మల్లయ్య, పొలంపల్లి మధునయ్యలు తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని పెద్దమనషుల సమక్షంలో పాలి పంపకం చేసుకున్నామని, తమ వాటాకు వచ్చిన భూమిని కొందరు ఒప్పందాన్ని ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనపై తగు విచారణ జరిపి, అట్టి రిజిస్ట్రేషన్ ను రద్దు పరచి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామానికి చెందిన దుర్గం సుమన్ తనతోపాటు మరి కొంతమంది రైతులకు షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ నుండి బోర్ పాయింట్ గుర్తించి బోర్ చేయడం జరిగిందని, ఇట్టి బోరులకు విద్యుత్తు లైన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీలలోని సర్పంచ్, ఉపసర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలలోని మేయర్/చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్/ వైస్ చైర్ పర్సన్ లకు ఈ నెల 12వ తేదీన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖ పరిధిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతి, ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు సంబంధించి గ్రామాలు, డివిజన్లు/వార్డుల వారీగా పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

సి ఎం. కప్ – 2025 లో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలను పూర్తి చేసుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో జిల్లా నుంచి పాల్గొని బ్యాడ్మింటన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *