మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం..రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద.
మంచిర్యాల జిల్లా, జనవరి 16, 2026:
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, మందమర్రి మండల తహసిల్దార్ సతీష్, డి.సి.సి. అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి లతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చెన్నూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారులు నిర్మించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు పథకం ఫలాలు అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అమృత్ పథకంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా నిరంతరం శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 1వ వార్డు అల్లూరినగర్‌లో 73 లక్షల 46 వేల రూపాయలు, 2వ వార్డు తిలక్‌నగర్‌లో 72 లక్షల 56 వేల రూపాయలు, 7వ వార్డులో 72 లక్షల 56 వేల రూపాయలు, 8వ వార్డు చైతన్య కాలనీలో 1 కోటి 89 లక్షల రూపాయలు, 9వ వార్డు ఆర్.ఆర్. నగర్‌లో 46 లక్షల రూపాయలు, న్యూ తిమ్మాపూర్‌లో 52 లక్షలు 50 వేల రూపాయలు, ఓల్డ్ తిమ్మాపూర్‌లో 44 లక్షల 50 వేల రూపాయలు, 12వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో 6 లక్షలు 17 వేల రూపాయలు, 13వ వార్డు ఆమ్‌నగర్ ప్రాంతంలో 6 లక్షల 17 వేల రూపాయలు, 14వ వార్డు మల్లికార్జున నగర్ ప్రాంతంలో 27 లక్షల 22 వేల రూపాయలు, 16వ వార్డు గంగా కాలనీలో 34 లక్షల 64 వేల రూపాయల అంచనా వ్యయంతో టి.యు.ఎఫ్.ఐ.డి.సి., డి.ఎం.ఎఫ్.టి., సి.ఎస్.ఆర్., నగర అభివృద్ధి నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల ప్రతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను ప్రణాళికబద్ధంగా వినియోగించి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చే వేసవిలో ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీటిని అందించేందుకు అమృత్ పథకం క్రింద నీటి ట్యాంకులు, ఇతర అనుబంధ పనులను చేపట్టి కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు కనీస అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





