ప్రాంతీయం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

17 Views

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా, జనవరి 9, 2026:
బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, బాలల సంక్షేమ కమిషన్ చైర్మన్ మహమ్మద్ వహీద్ లతో కలిసి సంక్షేమ శాఖల అధికారులు, పోలీసు, కార్మిక, విద్య, వైద్య-ఆరోగ్య, పౌర సంబంధాల శాఖల అధికారులతో ఆపరేషన్ స్మైల్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడి వారికి మంచి భవిష్యత్తును అందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. కార్మిక శాఖల అధికారులు బృంద సభ్యులతో కలిసి పరిశ్రమలు, దుకాణాలు, నిర్మాణ ప్రాంతాలు ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులను గుర్తించాలని తెలిపారు. 14 సం॥లలోపు వయసు కలిగి బాల కార్మికులు పని చేస్తున్నట్లుగా గుర్తించినట్లయితే సంబంధిత సంస్థల యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, బాధిత బాలలకు నష్టపరిహారం అందించాలని తెలిపారు. బాల్యవివాహాలను నిర్మూలించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. గుర్తించబడిన బాల కార్మికులకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించడం జరుగుతుందని, ఇటుక బట్టీలలో పనిచేసే వారి పిల్లలను పాఠశాలలో చేర్పించడం, అవసరమైన పుస్తకాలను అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సిహెచ్. దుర్గాప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఆనంద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *