డబ్బుల విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఫోన్ లో జరిగిన వివాదానికి మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ షాదాన్ బీ (28) వారి తోటి కోడలు సయ్యద్ గౌరీబీ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో తగాదా ఏర్పడగా ఫోన్ లో గొడవ పెట్టుకొని షాదాన్ బీ ని గౌరీబీ బూతు మాటలు తిట్టింది. అట్టి మాటలకు మనస్థాపం చెందిన షాదాన్ బీ ఈనెల 10వ తేదీన సోమవారం వారి ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకుంది. అది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేసి చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం షాదాన్ బీ మృతి చెందారు. షాదాన్ బీ మరణ వాంగ్మూలంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ మానస తెలిపారు.





