మే 20, 24/7 తెలుగు న్యూస్ : ఆపరేషన్ ఝాడు(చీపురు)
ఆప్‌ను ఖతం చేయటానికి ప్రధాని మోడీ వ్యూహం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ కార్యాలయానికి ఆప్ భారీ ప్రదర్శన
అడ్డుకున్న పోలీసులు..144 సెక్షన్ విధించింది.
ఆప్‌ను అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఆపరేషన్ ఝాడు (చీపురు) చేపట్టాయని ఆరోపించారు. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో, కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ శ్రేణలు ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించారు. అయితే దీనిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీకి దీటుగా ఆప్ ఎదగకుండా నిరోధించేందుకు బీజేపీ, ప్రధాని మోడీ కుట్రపూరితంగా ఆపరేషన్ ఝాడును తెరపైకి తీసుకొచ్చాయని అన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆప్ నేతలను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అరెస్ట్‌లతో పాటు, ఆప్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తారని విమర్శించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆప్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని ఈడీ న్యాయవాది ఇప్పటికే కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఖాతాలను ఇప్పుడే ఫ్రీజ్ చేస్తే ఆప్‌కు సానుభూతి లభిస్తుందనే ఉద్దేశంతో, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ పని చేసేందుకు కాషాయ పాలకులు స్కెచ్ వేశారని విమర్శించారు. ఎన్నికల అనంతరం పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధించి, రోడ్డు మీదకి తీసుకువస్తారని దుయ్యబట్టారు. బీజేపీ ఈ ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు తెలిపారు.మరోవైపు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రేణుల ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వారితోనే ఉన్నారు. ఆప్ కార్యాలయం నుంచి ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ శ్రేణులు బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉందని, గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని అనుమతి నిరాకరించారు. దాంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మంత్రులు, ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆప్ నేతలు భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొన్నారు.