మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య సురేఖ, సోదరుడు సత్యపాల్ రావు, కుమారుడు చరణ్ రావు, కోడలు శైలజ లతో కలిసి నామినేషన్ వేశారు.
రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) రాములుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రేమ్ సాగర్ రావు నివాసంకు తరలివచ్చారు. అక్కడ నుంచి ఐ బీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ జరిపారు. డప్పు చప్పుళ్ళు, మహిళల కోలాటాలు , రెపరేపలాడిన కాంగ్రెస్ జెండాలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు ర్యాలీలో పాల్గోన్నారు.
ర్యాలీలో మిత్ర పక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ , పట్టణ కార్యదర్శి ఖలందర్ ఖాన్ , ఏ.ఐ. టీ.యూ.సీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బీఆరెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సోదరుడు గడ్డం అచ్యుతం రెడ్డి పాల్గొన్నారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ అధిష్టానం కు ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో నిరంతరం తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.
ముఖ్యంగా కరోన సమయంలో ప్రజలకు ఎమ్మార్పీ ధరకు రేమిడీసీవర్ ఇంజక్షన్ ఇప్పించి ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. తాగునీరు సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినట్లు తెలిపారు.
బతుకమ్మ పండగకు చీరలు, రాంజాన్ కానుకలుగా చీరలు పంపిణీ చేశామన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశామని ప్రజలు తప్పకుండా ఆదరించి గెలిపిస్తారని ప్రేమసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.






