*తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర వెలకట్టలేనిది : సీఎం కేసీఆర్.*
హైదరాబాద్:సెప్టెంబర్ 05
ఉపాధ్యాయుల దినోత్సవం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’ అనే సూక్తి తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తున్నదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధ్యాయుల విద్యార్థుల సంక్షేమానికి అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని వివరించారు గురుకుల విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నదని తెలిపారు.
గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ క్రీడల్లోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతుండటం గర్వకారణమని అన్నారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.





