Breaking News

జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?*

110 Views

*జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?*

 

*రోగులకు చికిత్స చేసే వైద్యులు వ్యాధి నివారణకు రిస్క్రిప్షన్ లో ఇకపై జనరిక్‌ ఔషధాలనే రాయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టంచేసింది*

 

*ఒకవేళ అలా రాయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్‌ చేయకుండా అతని లైసెన్స్‌ను సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ‘రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలును ఎన్‌ఎంసీ జారీచేసింది. బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలను సైతం సూచించడం మానుకోవాలని వైద్యులకు సూచించింది. వైద్యులు జనరిక్‌ ఔషధాలను రాయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనను ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలను 2002లో భారతీయ వైద్య మండలి(ఐఎంసీ) జారీచేసిన నియమావళిలో ప్రస్తావించలేదు. బ్రాండెడ్‌ ఔషధాలతో పోల్చితే జనరిక్‌ ఔషధాలు 30 శాతం నుంచి 80 శాతం చౌకగా లభిస్తాయి. అందువల్ల జనరిక్‌ ఔషధాలను సూచిస్తే ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గించడంతోపాటు, నాణ్యమైన సంరక్షణ పొందేందుకు వీలు కలుగుతుందని ఆగస్టు 2వ తేదీన నోటిఫై చేసిన నిబంధనల్లో ఎన్‌ఎంసీ పేర్కొంది. మందుల చీటీలో సూచించిన పేర్లను స్పష్టంగా చదవగలిగేలా పొడి అక్షరాల్లోనే రాయాలని, వీలైతే మందుల చీటీని టైప్‌ చేసి ప్రింట్‌ తీసి ఇవ్వాలని పేర్కొంది. తాజా నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు తొలుత హెచ్చరికలు జారీ చేస్తామని, అవసరమైతే వర్క్‌షాప్‌లకు హాజరవ్వాల్సిందిగా కోరతామని ఎన్‌ఎంసీ తెలిపింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వైద్యుల లైసెన్స్‌ను కొంతకాలం సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేసింది*

 

*జనరిక్ మందులు అంటే..*

 

*ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేస్తాయి. కొన్నేళ్ల పాటూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. అవే బ్రాండెడ్ మందులు. ఆ మందు తయారీపై, ఆ ఫార్మా కంపెనీకి ఇరవై ఏళ్ల పాటూ పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్లు ఆ మందును అదే ఫార్ములాతో తయారు చేయకూడదు. ఆ మందు తయారీలో చాలా ఖర్చు పెట్టామని సదరు కంపెనీ వాదిస్తుంది. ఆ సొమ్మును రాబట్టుకోవాలంటే ఆ మందును తాము మాత్రమే అమ్మాలని భావిస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును సదరు కంపెనీకి ఇస్తాయి*

 

*20 ఏళ్ల తర్వాత ఎవరైనా..*

 

*ఇరవై ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారుచేసి తక్కువ రేటుకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందును తయారు చేసి తక్కువ రేటుకే పేదల కోసం అమ్మే వాటిని జనరిక్ మందులు అంటారు. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లోనే అమ్ముతారు.సిప్లా, ఎస్ఆర్, రెడ్డీస్.. ఇవన్నీ బ్రాండెడ్ మందుల సంస్థలు*

 

*జనరిక్‌ మందులు నాణ్యమైనవేనా?*

 

*జనరిక్‌ అయినా బ్రాండెడ్‌ అయినా తయారీ నాణ్యత, పనితీరు ఒకే విధంగా ఉంటాయి. తయారీలోనూ, మార్కెటింగ్‌లోనూ అదనపు ఖర్చు ఉండదు కాబట్టే తక్కువ ధరల్లో లభించేందుకు సాధ్యపడుతుంది. కాలపరిమితి ముగియటంతో మొదటి ఉత్పత్తిదారుడు పేటంట్ రైట్ కోల్పోవటంతో ఇతరులు వీటిని తయారుచేస్తారు. దీర్ఘకాలిక రోగాలకు ‘జనరిక్‌’ ఔషధాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ఖరీదైన మందులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరే అయినా, ప్రజలు జనరిక్‌ మందుల వైపు వెళ్లడం లేదు. అందుకే వీటి వాడకాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. బయట మార్కెట్ రూ. 20కు దొరికే టాబ్లెట్ జనరిక్ మెడిసిన్ కేవలం రూ.8 లభిస్తుంది*

 

*సిఫార్సు చేయకపోవడానికి కారణాలు..*

 

*తక్కువ ధరలో వచ్చే జనరిక్ మందులు కాకుండా ఎక్కువ రేటుతో ఉండే ప్రైవేట్ సంస్థల మందులను వైద్యులు ఎందుకు సిఫార్సు చేస్తారు. ఎక్కువ ధర మందులు కొంటే ఆయా వైద్యులకు వచ్చే లాభం ఏంటి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ప్రైవేట్ ఫార్మా కంపెనీలు ప్రతినిధులను నియమించుకుని ప్రతి ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు తమ మందుల గురించి వివరిస్తాయి. తమ మందులు రాయమని వారిని కోరతాయి. ఇలా రాసినందుకు గాను వైద్యులకు ఆయా సంస్థల రిప్రజెంటేటివ్‌ లు బహుమతులు, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీలు, రిసార్టుల్లో పార్టీలు ఇస్తారన్న విషయం బహిరంగ రహస్యమే. అలాంటి వాటికి ఆశపడి కొంత మంది వైద్యులు బ్రాండెడ్ మందులను సిఫార్సు చేస్తుంటారు. అందుకే ఈ ఖరీదైన మందులను అరికట్ట జనరిక్ రాసి పేదలకు ఆర్థిక భారం తగ్గించాలని కేంద్రం వైద్యులను ఆదేశించింది. మరి ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. డాక్టర్లపై కేంద్రం నియంత్రణలు పనిచేస్తాయా? పాటిస్తారా? అన్నది వేచిచూడాలి*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *