Breaking News

మూడో కంటికి తెలియకుండా రహస్య మంతనాలు*?

116 Views

*మూడో కంటికి తెలియకుండా రహస్య మంతనాలు*???

 

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరుగుతున్నది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లోనూ వలసలపై సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా సీక్రేట్‌గా ప్రాథమిక స్థాయిలో సంప్రదింపుల పర్వం ఊపందుకున్నది. వీలైతే టికెట్ లేదంటే ప్యాకేజ్.. ఇవే ఆ చర్చల్లోని కీలక అంశాలు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో ఇలాంటి పాలిటిక్స్ కొనసాగుతుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఇవి కాస్త ఎక్కువే ఉన్నాయి. టికెట్ ఖరారు చేస్తే వెంటనే చేరిపోవడానికి నేతలు సిద్ధమవుతున్నారు. ఒకవేళ అప్పటికే వేరే వ్యక్తికి టికెట్ ఖరారైనట్లయితే ప్యాకేజీ కోసం డీల్ కుదుర్చుకోవడంపై దృష్టి పెట్టారు.

 

*కాంగ్రెస్‌లో ఇదీ పరిస్థితి..*???

 

టికెట్‌ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నది ఏఐసీసీ కావడంతో రాష్ట్ర స్థాయిలోని నేతలు పార్టీలో చేరే నేతలకు నిర్దిష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. పీసీసీ చీఫ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిలు చర్చించుకుని ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపుతున్నా అంతిమ నిర్ణయంపై స్పష్టంగా భరోసా కల్పించలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుపై మాత్రం రాష్ట్ర నేతలు హామీ ఇస్తున్నారు. కానీ పార్టీలోకి చేరాలనుకుంటున్న నాయకులు మాత్రం వీలైతే టికెట్ లేదా ప్యాకేజీ కోసం పట్టుబడుతున్నారు. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గానే ప్రకటనలు చేశారు. ఈ వారంలోనే ఢిల్లీ వేదికగా కొందరు చేరారు. ఈ నెల చివరికల్లా ఇంకొంతమంది చేరడం ఖాయమనే సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చారు.

 

బీఆర్ఎస్‌లో సిట్టింగులకే సీట్లు అని పార్టీ అధినేత పలు సందర్భాల్లో ప్రకటన చేయడంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్నవారు ఆలోచనలో పడ్డారు. ఇతర పార్టీల్లో గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరిన ప్రాంతాల్లో పలువురు గులాబీ ఆశావహులు, గతంలో పోటీచేసి ఓడిపోయినవారు ఈసారి టికెట్ దక్కడంపై అనుమానంతో ఉన్నారు. ఇలాంటివారు ఇతర పార్టీల్లో చేరడంపై వారివంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు చాలా మంది నేతలు బీజేపీలోకి వలస వెళ్లారు. కానీ తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీకి ప్రాధాన్యం తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తున్నది. వారిని చేర్చుకోవడమే కీలకం కావడంతో టికెట్, ప్యాకేజీ, నామినేటెడ్ పోస్టుల గురించి ఏఐసీసీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ నేతలు, వ్యూహకర్త అభిప్రాయాలన్నింటినీ బేరీజు వేసుకుని నిర్ణయాన్ని ప్రకటించడమే మిగిలింది.

 

బీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనిత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే చేరిక ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. షరా మామూలు తరహాలో తాము పార్టీని వీడడంలేదంటూ గులాబీ నేతలు స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. బీజేపీ నుంచి కూడా పలువురు నేతలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సహా కొంతమంది ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు ఏఐసీసీ కార్యాలయ వర్గాల సమాచారం. టికెట్ల విషయంలో స్పష్టమైన హామీ రాగానే సరైన ముహూర్తం ఫిక్స్ అవుతుందని టాక్. రానున్న రెండు నెలల్లో వలసలు భారీ స్థాయిలోనే జరగనున్నట్టు తెలుస్తున్నది.

 

*బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్*??

 

బీఆర్ఎస్ సైతం వలసలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలపై దృష్టి సారించింది. గ్రామ స్థాయిలో ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నదనే ఉద్దేశంతో వీలైనంతగా డీమోరల్ చేయాలని భావిస్తున్నది. ఒకవైపు ఆకర్షించే ప్రయత్నాలతో పాటు కాంగ్రెస్‌ను వీక్ చేయడం కూడా బీఆర్ఎస్ టాస్కుగా మారింది. గులాబీ పార్టీలో చేరేవారికి టికెట్ ఆఫర్ సంగతి ఎలా ఉన్నా మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ స్పష్టం చేస్తున్నది. కార్పొరేషన్ పోస్టు లేదా ఇతర నామినేటెడ్ అవకాశాలపై హామీ ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తరహాలో నిర్ణయం కోసం ఢిల్లీ పెద్దలపై ఆధారపడే అవసరం లేకుండా హైదరాబాద్ కేంద్రంగానే డెసిషన్ జరగడం బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్. కేసీఆర్ డైరెక్షన్‌లో గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్ నుంచి లీడర్లను లాగడానికి జిల్లాల స్థాయిలో ముమ్మరంగా కసరత్తు మొదలైంది. సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తామని నోటిమాటగా కేసీఆర్ చెప్పినా.. కొన్నిచోట్ల మార్పు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత దృష్ట్యా అభ్యర్థులను మార్చడం అనివార్యమవుతున్నది. దీంతో కాంగ్రెస్‌లో టికెట్ రాదనే అనుమానం ఉన్న నేతలను లాగేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గెలుపు గుర్రాలు ఏ పార్టీలో ఉన్నా వారిని లాక్కోవడమే బీఆర్ఎస్ ఎజెండాగా పెట్టుకున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అక్కడి నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. విజయావకాశాలు ఉన్న నేతలను పార్టీలోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గులాబీ వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. బీఆర్ఎస్‌లో చేరడానికి టికెట్, ప్యాకేజీ, పదవులపై స్పష్టమైన హామీ ఇస్తున్నట్టు సమాచారం.

 

*ఆపరేషన్ లోటస్ ప్లాన్‌లో బీజేపీ*??

 

బీజేపీ వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఒక అంశం. బీఆర్ఎస్‌లో నెలకొన్న టికెట్ల అసంతృప్తి, అనుమానం సహజంగా కాంగ్రెస్‌ వైపునకు మళ్లుతుందని, అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లిన వారు బీజేపీకి చేరడం ఖాయమనే అభిప్రాయంతో ఉన్నది. ఆషాఢ మాసం కారణంగా ఇంతకాలం ఆలస్యమైందని, ఇకపైన చేరికలు ఊపందుకుంటాయని కమలనాథులు గంపెడాశలతో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత చప్పబడిన బీజేపీలో ఇటీవల జరిగిన మార్పులతో శ్రేణుల్లో జోష్ పెంచాలనే కసరత్తు జరుగుతున్నది. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కనీసం డజను మందిని పార్టీలో చేరుస్తానంటూ ఇటీవల ఒకరిద్దరు నేతలతో వ్యాఖ్యానించినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

వచ్చే నెల చివరికల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చేరికలు ఉండొచ్చని సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌లో టికెట్ డౌట్ అనుకునేవారందరికీ బీజేపీ సేఫ్ జోన్‌గా ఉంటుందన్న ధీమాను ఒక నేత వ్యక్తం చేశారు. కానీ చేరే ముందు షరతుల్లేకుండానే చేరాలని చెబుతున్నా.. ఏ హామీ లేకపోతే ఎందుకు చేరుతారని కొందరు ఎదురవుతున్న ప్రశ్నలు. తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ వీలైనంతగా హైదరాబాద్‌లోనే మకాం వేస్తారని, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులతో సంప్రదింపుల తర్వాత టికెట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదనే హామీని ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. పార్టీలు మారుతున్న నేతలంతా టికెట్, ప్యాకేజ్, పోస్టు కోసమే పట్టుబడుతున్నారు. స్థాయికి తగినంతగా ప్యాకేజీ రేట్ ఫిక్స్ అవుతున్నది. ఒక్కో పార్టీలో ఒక్కో తీరులో ఇది గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ అవుతున్నది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *