భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల, తెలుగు న్యూస్ :
భూ సమస్యల పరిష్కారం, గ్రామ నక్షాల నిర్ధారణ పటిష్టపరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి మండల తహసిల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కడస్ట్రల్,నాన్ కడస్ట్రల్ కలిపి 12 గ్రామాలలో రీ సర్వే ప్రక్రియ మొదలు పెట్టి మొత్తంగా 30 వేల 687 ఎకరాలు ఉండగా 8 వేల 376 ఎకరాలు రీ సర్వే పూర్తి కావడం జరిగిందని,
జిల్లాలో రీ సర్వే ప్రక్రియను నిర్దేశిత నిబంధనల ప్రకారం దశల వారీగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రీ సర్వేలో భాగంగా రాష్ట్ర గెజిట్‌లో సెక్షన్–5 నోటిఫికేషన్ జారీ చేయడం, 2 స్పెల్‌లకు సంబంధించి సెక్షన్–6 నోటిఫికేషన్‌ను జిల్లా గెజిట్‌లో ప్రచురించడం, గ్రామసభ నిర్వహించడం, గ్రామ సరిహద్దుల నిర్ధారణ చేపట్టడం, ఆవాస ప్రాంతాల సరిహద్దులను నిర్ధారించడం, అటవీ, రహదారులు, కాలువలు, నీటి వనరులు తదితర ప్రభుత్వ భూములను గుర్తించి సరిహద్దులు నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి ఫీల్డ్ రిజిస్టర్‌ను పూర్తి చేయడం, భూమి విస్తీర్ణాల పాలిగాన్‌లను డిజిటలైజేషన్ చేయడం, షేప్‌ఫైళ్లను రూపొందించడం, భూమి పార్సెల్‌లకు ఎల్‌పిఎం నంబర్లు కేటాయించడం, ఫీల్డ్ రిజిస్టర్ ప్రతిని తహసీల్దార్‌కు అందజేసి పరిశీలన, తదుపరి ప్రక్రియ చేపట్టడం, టోపాలజీ చెక్ నిర్వహించడం, పాత రికార్డుల నుంచి కొత్త రికార్డులకు కరెక్షన్/కో-రిలేషన్ స్టేట్‌మెంట్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. సిఎస్‌ఓ ద్వారా షేప్‌ఫైళ్లను ధృవీకరించడం, ఖాతా వారీగా నిర్ధారించిన విస్తీర్ణంతో సెక్షన్–9(2) నోటీసులు జారీ చేయడం, అభ్యంతరాలు/అప్పీళ్ల కోసం 60 రోజుల గడువు ఇవ్వడం, అందిన అభ్యంతరాలను డిప్యూటీ ఐఓఎస్ ద్వారా 60 రోజుల లోపు పరిష్కరించడం, అప్పీల్‌లో మార్పులు ఉంటే వాటిని రికార్డుల్లో పొందుపరచడం, తుది కో-రిలేషన్ స్టేట్‌మెంట్, తుది ల్యాండ్ రిజిస్టర్‌ను సిద్ధం చేయడం, తుది షేప్‌ఫైళ్లను సిఎస్‌ఓ ద్వారా ధృవీకరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ మ్యాప్, ఆవాస మ్యాప్, ట్రావర్స్ మ్యాప్ తదితర తుది రికార్డులను సిద్ధం చేయడం, భూధార్, ఎల్‌పిఎం జనరేషన్ కోసం సిఎస్‌ఓ నుంచి ఎన్‌ఐసికి సమాచారం అందించడం, సెక్షన్–13 నోటిఫికేషన్ జారీ చేయడం, గెజిట్‌లో ప్రచురించడం, తుది రికార్డులను తహసీల్దార్‌కు అప్పగించడం,
రీ సర్వే ప్రక్రియకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపారు. రీ సర్వే ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, క్షేత్రస్థాయి పరిశీలనతో నిర్వహించి, భూముల సరిహద్దులు, విస్తీర్ణాలు, హక్కులు, సంబంధిత రికార్డులను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. భూముల రీ సర్వేకు సంబంధించి దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలకు ఆయా మండలాల తహసిల్దార్లు వెంటనే రిజాయిండర్లు సమర్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





