విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
మంచిర్యాల,జూలై 13, 2026:
విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం కొలాంగూడ (పి) గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో 38 లక్షల 15 వేల రూపాయల డి ఎం ఎఫ్ టి నిధులతో పాఠశాల భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ సదుపాయాలు కల్పించడంతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో అదనపు గదులు, భోజనశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని, 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





