Breaking News

వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం శనివారం నుంచి ప్రారంభం

117 Views

హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష అందించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల వేదికగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్థిక సాయం అందజేత నిరంతర ప్రక్రియగా కొనసాగనుండగా, శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తుల బలోపేతానికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని రూపొందించింది. పనిముట్లు కొనుగోలు, ఆధునికీకరణ, ముడిసరుకు కొనుగోలుకు ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. బీసీ-ఏ నుంచి 2,66,001, బీసీ-బీ నుంచి 1,85,136, బీసీ-డీ నుంచి 65,310, ఎంబీసీల నుంచి 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి నెల 5లోగా వెరిఫికేషన్‌ పూర్తయినవారికి అదే నెల 15న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందజేయాలని నిర్ణయించారు. జూలై 18 నుంచి మిగిలిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానున్నది. రూ.లక్ష సాయం పొందిన లబ్ధిదారులు తాము కొనుగోలు చేసిన పనిముట్లు లేదా ముడిసరుకుకు సంబంధించిన ఫొటోలను 30 రోజుల్లోగా అప్‌లోడ్‌ చేయాలి. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో ఆ యూనిట్ల గ్రౌండింగ్‌ను పర్యవేక్షిస్తారు.

 

*లక్ష సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి*

 

బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధునిక పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకొని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాన్ని నెరవేర్చాలి. ఆ దిశగా క్షేత్రస్థాయి అధికారుల కృషి చేయాలి.– గంగుల కమలాకర్‌,బీసీ సంక్షేమశాఖ మంత్రి

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *